Thursday 6 November 2014

బతక నీయండయ్య బతుకమ్మను

ఓ అన్న లారా ! ఓ అక్కలారా

పి .ఎన్ మూర్తి
ph : 9441151762

మా అమ్మ బొడ్డెమ్మ – ఓ అన్న లారా ! ఓ అక్కలారా
పుట్టనీయండయ్య బొడ్డెమ్మను -ఓ అన్న లారా ! ఓ అక్కలారా
మా అమ్మ బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా
బతక నీయండయ్య బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా

బంగారు గౌరమ్మ కనువిందుగా
తెలంగాణ మాగాణి సిరి పండగా
తెనుగింట బతుకమ్మ తొలి పండగై
శ్రీలక్షి ప్రతియింట కొలువవ్వగా

నా తల్లి నిలువెల్ల పుల్లకించగా
నేలమ్మ అణువణువు రవళించగా
నవమాసముల ఫలము ప్రసవించగా
నలుగురండగ నిలివాలి బొడ్డెమ్మకు

మొగ్గ తొడిగిన పువ్వు వికసించగా
చదువులా నా తల్లి దీవించగా
సకల విద్యలు నేర్చి రాణించగా
పదుగురు మెచ్చరే బొడ్డెమ్మను

సమక్కసారక్క మది నిండుగా
అయిలమ్మ సాహాసం కలపండగా
రాణిరుద్రమదేవి యదనుండగా
కొత్త ఆశల సమత జనపండగా.....

మా అమ్మ బొడ్డెమ్మ – ఓ అన్న లారా ! ఓ అక్కలారా
పుట్టనీయండయ్య బొడ్డెమ్మను -ఓ అన్న లారా ! ఓ అక్కలారా
మా అమ్మ బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా

బతక నీయండయ్య బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా 

No comments:

Post a Comment